హైదరాబాద్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల ఇబ్బందులతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. పెట్టుబాడిదారుల సదస్సులో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ నగరానికి వచ్చిన విషయం విదితమే.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ దిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు.