యూపీ కాన్పుర్‌లో ఓ అమ్మాయికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. ‘నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ గా మారితే.. పరీక్షలో పాస్ చేస్తాను’ అంటూ గుర్తుతెలియని వ్యక్తి ఆ యువతిని ప్రలోభపెట్టాడు. అంతేకాకుండా రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇంకా ఏం అన్నాడంటే..?
బాధిత యువతి మహరాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తోంది. కాన్పుర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఆమె.. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయింది. కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్ కట్టింది. నవంబరులో ఆమె మొబైల్ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోను, మెసేజ్ వచ్చింది.
పరీక్షలో పాస్ కావాలనుకుంటే.. నాకు రూ.5 వేలు ఇవ్వు… నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారు అంటూ మెసేజ్‌లో ఉంది. ఆ వ్యక్తి ప్రతిపాదనను యువతి తిరస్కరించింది. తీరా రీకౌంటింగ్ ఫలితాలు చూసుకునే సరికి యువతి మళ్లీ ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా.. రీకౌంటింగ్‌లో సున్నా వచ్చాయి. ఇది తనకు కాల్ చేసిన వ్యక్తి పనే అన్న యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.