సిక్కిం రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉత్తర సిక్కింలో జెమా వద్ద ఆర్మీ ట్రక్కు లోయలోకి జారిపడటంతో 16 మంది సైనికులు మరణించారు. ఈ ఆర్మీ వాహనం మూడు వాహనాల కాన్వాయ్‌లో భాగంగా ఉంది. ఈ వాహనం ఉదయం చటెన్ నుంచి థంగు వైపు వెళ్లింది. జెమాకు వెళ్లే మార్గంలో, వాహనం వేగంగా మలుపు తీసుకుంటుండగా నిటారుగా ఉన్న వాలుపైకి జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆర్మీ వాహనం బోల్తాపడి 16 మంది జవాన్లు మరణించిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్లు, అధికారుల కుటుంబాలకు సీఎం తన సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగువిధంగా వైద్యసేవలందించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.
సిక్కింలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడింది. 16 మంది చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ప్రకటించారు. మూడు వాహనాల్లో ఆర్మీ కాన్వాయ్ ఛట్టేన్ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్ట్ లకు వెళ్తుండగా మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులు ఉన్నారు. వంద అడుగుల ఎత్తు నుంచి పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.