ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విదేశాంగ కార్యాలయం సమీపంలో బుధవారంనాడు ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 20 మందికి పైగా మృతి చెందారు. సెంట్రల్ కాబూల్ బిల్డింగ్ వెలుపల ఉన్న వీధిలో మంచుకింద పలువురు పడిఉన్నట్టు ఘటనా స్థలికి సంబంధించిన ఫోటోల్లో కనిపిస్తోంది. ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్టు చూశానని, అయితే ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన, గాయపడిన వారు ఎంతమందనేది తనకు కచ్చితంగా తెలియదని ఏఎఫ్పీ డ్రైవర్ జంషెడ్ కరీమీ తెలిపారు.
కాగా, పేలుడు ఘటనను కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ ధ్రువీకరించారు. పలువురు దురదృష్టవశాత్తూ మృత్యువాత పడ్డారని, భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయని ఆనయ ట్వీట్ చేశారు. ఆగస్టు 2021లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భద్రతా పరిస్థితి మెరుగైనట్టు తాలిబన్లు ప్రకటించినప్పటికీ, పలు బాంబు పేలుళ్లు, దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నారు. వీటి వెనుక స్థానిక ఇస్లామిక్ స్టేట్ (IS) ప్రమేయం ఉందని చెబుతున్నారు.