రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంలోనూ రాజకీయ చిచ్చు ప్రారంభమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భర్త ఒక పార్టీలో, భార్య ఒక పార్టీలో ఉంటూ.. తమ హవా సాగించా లని చూస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ తరఫున పురందేశ్వరి విశాఖ నుంచి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, వెంకటేశ్వరరావు.. పరుచూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో వెంకటేశ్వర రావు ఒకింత చురుగ్గా ఉండడం లేదు. అయినప్పటికీ.. ఆయన అధికారులు, నేతలతో చర్చించి స్థానికంగా పనులు చేయించుకుం టున్నారు.
తమ పార్టీ అదికారంలోనే ఉంది కనుక తమకు ఇబ్బంది లేదనే ధోరణితో ఆయన ఉన్నారు. అయితే, దీనికిభిన్నంగా బీజేపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసింది. దీంతో ప్రతి నాయకుడు వైసీపీని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శి స్తేనే.. బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన పురందేశ్వరి.. ఇటీవల కాలంలో తరచుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాజధాని అమరావతిపై కూడా ఆమె కామెంట్లు కుమ్మరిం చారు. అంతేకాదు, జగన్ పాలన పిచ్చిపట్టిస్తోందని అన్నారు. అమరావతిలో అక్రమాలు జరిగితే విచారించి చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా అర్ధంతరంగా దానిని ఆపేస్తే.. ఎలా? అని ప్రశ్నించారు.
పోలవరంపై కూడా కామెంట్లు చేశారు. కేంద్రం వద్దన్నా రివర్స్‌కు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. ఇలా జగన్ ప్రభుత్వాన్ని ఆమె ఇరుకున పెట్టడంతో వైసీపీ నేతల్లో ఆలోచన ప్రారంభమైంది. ఇదే విషయంపై జగన్ కూడా దృష్టి పెట్టారని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తన భార్య చేసిన కామెంట్లను ఖండించకపోగా.. మౌనం పాటించడంపై జగన్ ఒకింత అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అసలు పరుచూరులో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? దగ్గుబాటి ఎలాంటి రోల్ పోషిస్తున్నారు? అనే విషయాలపై ఏకంగా ఇంటిలిజెన్స్ వర్గాలనే పురమాయించినట్టు తెలిసింది.
అదే సమయంలోప్రకాశం జిల్లా వైసీపీ ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. స్థానికంగా నాయకత్వం ఎలా ఉంది? వచ్చే స్థానిక సంస్థల నాటికి పార్టీ బలపడుతుందా? లేదా? అసలు ఇంత జరుగుతున్నా వెంకటేశ్వరరావు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వంటి కీలక విషయాలపై ఆయన కూపీ లాగుతున్నారని తెలిసింది. దీనిని బట్టి త్వరలోనే దగ్గుబాటిని పిలిపించి మాట్లాడతారని కూడా తాడేపల్లి వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.