ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. “దేశ ప్రజలకు గణంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ.. వీటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం” అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అమర జవాన్లకు నివాళి అర్పించారు.
మరోవైపు దిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకావిష్కరణ చేశారు. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి హాజరయ్యారు. కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరిస్తున్నారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు జవాన్ల కవాతు జరుగుతోంది. పరేడ్ తిలకించేందుకు 45 వేల మంది సందర్శకులు వచ్చారు.