రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం విచారణను 2.30గంటలకు వాయిదా వేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ ఉన్నందున అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. బడ్జెట్‌కు అనుమతి కోసం ఈనెల 21న గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం ఉందో లేదో తెలపాలని రాజ్‌భవన్ అడిగిందని కోర్టుకు వివరించారు. ఆర్థిక బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గవర్నర్ విచక్షణాధికారం రాజ్యాంగబద్ధమే కానీ వ్యక్తిగతం కాదని వివరించింది.
వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు..? రాజ్యాంగ వ్యవస్థలను కోర్టు ముందుకు తీసుకురావడం ఎందుకు..? వివాదంలో మేము ఏమని ఆదేశాలు ఇవ్వాలి అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చనని తెలిపారు. ఈ క్రమంలో పలు సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తావించారు. వివాదం సున్నితత్వం, సంక్లిష్టత అర్థం చేసుకోగలనన్న దుష్యంత్ దవే.. అనుమతివ్వాలని గవర్నర్ కోరుతూ ఉత్తర్వులు ఇవ్వొచ్చని కోర్టుకు విన్నవించారు.