తెలంగాణ సర్కార్ ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే కొండగట్టు అంజన్న ఆలయానికి వంద కోట్లు కేటాయించిన సర్కార్.. ఇప్పుడు చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర కోవెలను సరికొత్తగా నిర్మించేందుకు కసరత్తు షురూ చేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్‌ను కూడా రెడీ చేసింది. ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం.. కర్ణాటకలోని శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకొని మాస్టర్‌ప్లాన్ అమలుచేయాలని భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.50 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ పరిసరాల్లోని విశ్రాంతి భవనాల మరమ్మతులు..తదితర పనులు చేపట్టింది. రూ.22 కోట్లతో ప్రస్తుత గర్భాలయాన్ని కృష్ణశిలలతో ఆధునిక హంగులతో నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్షేత్రంలోని గర్భగుడిలో మహా సరస్వతి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది.
ఆగమ శాస్త్రం ప్రకారం సరస్వతీ అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ఉండాలి. అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించదు. అందుకని ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని పూర్తిగా తొలగించి కొత్త మండపాన్ని చేపట్టే ప్రణాళిక రూపొందుతోంది.