ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభి పై పోలీసులు సెక్షన్ 153 (ఏ), 505(2), 353, 504 రెడ్ విత్ 120 (బి) కింద క్రైమ్ నెంబర్ 352/ 2021 కేసును నమోదు చేశారు.
ఇక పట్టాభిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే సమయంలో టిడిపి కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో అక్కడికి చేరుకున్న టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. వెంటనే పట్టాభిని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీ బందోబస్తు నడుమ పట్టాభిని పోలీసులు కోర్టుకు తరలించారు. పట్టాభి తో పాటు మరొక 15 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. అయితే కోర్టుకు వెళ్లే సమయంలో పట్టాభి తన వాచిపోయిన చేతులను చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు పట్టాభి.