శ్రీవారితో గేమ్ ఆడుతున్నదెవ్వరు..? డైవర్షన్ పాలిటిక్స్ ప్రచారంలో నిజమెంత..?

-

ఏడుకొండల వెంకటేశ్వరుని చుట్టూ.. రాజకీయ వివాదం నడుస్తోంది.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..వైసీపీ హయాంలో ఇదంతా జరిగిందంటూ ఆయన బాంబ్ పేల్చారు.. ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది..

గత వైసీపీ ఐదేళ్ల హయాంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు.. తిరుమల వెంకటేశ్వరున్ని పేదవాడికి కూడా చేరువ చేశారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు కావొస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టి పడింది..

లడ్డుల్లో వాడే నెయ్యి నాణ్యతపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక వచ్చిందని టీడీపీ చెబుతోంది.. NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిన తేదీలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ శాంపిల్స్‌ను సేకరించారని.. ఆ తేదీలను బట్టి చూస్తే అర్దమవుతోందని వైసీపీ నేతలువాదిస్తున్నారు.. జూలైలో నివేదిక ఇస్తే ఇప్పటి వరకు బయటపెట్టకుండా ఎందుకు దాచారని వారు ప్రశ్నిస్తున్నారు..

కూటమి ప్రభుత్వం వందరోజులపాలనను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఈ వ్యవహారాన్నితెరమీదకు తీసుకొచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది.. చంద్రబాబు హామీల అమల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే.. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైసీపీ నేతలే డిమాండ్ చేస్తున్నారు.. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు , కూటమి నేతలు చేసిన ఆరోపణలు మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వయరీ చేయించాని హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఇది విచారణకు వచ్చే అవకాశముంది.. విచారణ జరిగితే దాన్ని నిరూపించాల్సి ఉంటుంది.. ఇది టీడీపీకి తలనొప్పిగా మారే అంశమని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా..లేక మరేదైనా కారణం ఉందా అనేది ఆ దేవదేవునికే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news