బీజేపీలో సీనియర్ నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించిన నేత. బీజేపీ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నేత. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసిన ఆ నేతకు అదృష్టం కలిసొచ్చింది.. ఓ చోట ఎమ్మెల్యేగా ఓడి మరో చోట ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. అయితే ఢిల్లీలో చక్రం తిప్పగలడు కానీ, ఉండేందుకు మాత్రం ఢిల్లీలో కనీసం ఇల్లు లేదు.. పేరు పెద్దదే అయినా.. ఉండేందుకు ఇల్లు లేక ఏపీ భవన్‌లో మాకాం వేసాడు. ఇప్పుడు ఈ కేంద్రమంత్రి పరిస్థితి ఎలా ఉందంటే.. హోటల్ మే ఖానా.. మసీద్ మే సోనా అన్న చందంగా మారింది.
ఇంతకు ఈ నేత ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. అతడు ఎవరో కాదండి.. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి. అంబర్‌పేట ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో గులాబీ దాటికి ఓటమి చెందాడు. దీంతో ఆరునెలలు తిరగకుండానే పడిన చోటే లేవాలనే సూత్రాన్ని ఆసరా చేసుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కమలం జెండాను ఎగురవేశారు. మొదటిసారి ఎంపీగా గెలిచినా పార్టీకి చేసిన సేవలు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి విధేయతతో దశ తిరిగిపోయింది. అమిత్ షాతో ఉన్న సాన్నిహిత్యంతో మోడీ మంత్రి వర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఎంపికయ్యాడు. ఇలా దశ తిరిగిన కిషన్‌రెడ్డి ఒక్కసారే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
ఓ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా పర్యవేక్షణలో ఉండే కిషన్‌రెడ్డికి మాత్రం ఉండేందుకు ఇల్లు లేని ధీనస్థితి వచ్చింది. కిషన్ రెడ్డికి తుగ్లక్ క్రెసెంట్ రోడ్ లో మినిస్టర్ బంగ్లాని కేటాయించారు. కానీ ఆ ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఉంటున్నారు. తనకు వేరే బంగ్లా కేటాయించాలని సిన్హా పట్టణాభివృద్ధి శాఖాధికారులను ఇది వరకే కోరారు. దాంతో సిన్హాకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ ను కేటాయించింది పట్టణాభివృద్ధికి శాఖా. కానీ ఆ ఇంట్లో బీజేపీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్ ఉంటున్నారు.
అటు రాధామోహన్ సింగ్ ఇల్లు ఖాళీ చేయరు.. ఇటు సిన్హా తన బంగ్లాని ఖాళీ చేసి రాధామోహన్ సింగ్ ఇంటికి మారలేదు. దీంతో కిషన్‌రెడ్డికి ఇల్లు లేకుండా పోయింది. ఏమీ చేయాలో తెలియని కిషన్‌రెడ్డి తప్పని పరిస్థితిలో ఏపీ భవన్ అడ్డా చేసుకుని పాలన చేస్తున్నాడు. పాపం కిషన్‌రెడ్డికి కొంప లేకపోవడంతో ఢిల్లీలో అష్ట కష్టాలు పడుతున్నాడు.. ఇకనైనా కేంద్రం స్పందించి మంత్రిగారికి ఓ ఇల్లు ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.