భూమా వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ మంత్రి అఖిలప్రియ ప్రస్తుతం అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. తల్లి శోభానాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల…తండ్రి నాగిరెడ్డితో కలిసి తర్వాత టీడీపీలోకి వచ్చింది. తండ్రి కూడా అకాలమరణం చెందడంతో భూమా కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అదే సమయంలో చంద్రబాబు…అఖిలకు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇక మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి..అఖిల ఓటమి పాలయ్యారు. అటు రాష్ట్రంలో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
ఓటమి పాలైన దగ్గర నుంచి అఖిల పరిస్తితి దారుణంగా తయారైంది. నియోజకవర్గంలో భూమా ఫ్యామిలీ మద్ధతుదారులు, కార్యకర్తలపై కేసులు వేదింపులు మొదలయ్యాయి. దీనిపై అఖిలప్రియ ఒంటరిగానే పోరాటం చేస్తోంది. అధిష్టానం మద్ధతు ఏ మాత్రం దక్కడం లేదు. దీంతో చాలామంది కార్యకర్తలు భయపడి బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. ఇటీవల అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈయన కూడా తన అనుచరులపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకే సేఫ్ ప్లేస్ గా బీజేపీని ఎంచుకున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో అఖిల పరిస్తితి గందరగోళంగా తయారైంది. ఒకవైపు చంద్రబాబు మద్ధతు దక్కడం లేదు… మరోవైపు నియోజకవర్గంలో పట్టు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అఖిల టీడీపీని వీడేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా అని ఆమె ఏ పార్టీలోకి వెళ్లతారో క్లారీటీ లేదు. అఖిలకు…జగన్ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. అటు అఖిలప్రియ మేనమామ ఎవ్సీ మోహన్ రెడ్డి కూడా వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఆమె వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకుంటున్న తరుణంలో…తాజాగా అఖిల..బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు.
దీంతో అఖిలప్రియ బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం కిషన్ రెడ్డిని కలిసి తమ నియోజకవర్గంలో పరిస్థితులని వివరించానని చెబుతున్నారు. ఆళ్లగడ్డలో తనకు, తన అనుచరులకు పోలీసుల పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదుకే ఆయనను కలిశారంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అఖిల ఏ పార్టీ వైపు వెళుతుందో ? పూర్తి క్లారీటీ లేదు. అలా అని టీడీపీలో కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు.