పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న వైసీపీ అధినేత జగన్.. క్యాడర్ లో జోష్ నింపేలా వ్యూహాలు

-

కీలక నేతలు రాజీనామాలు చేస్తున్న వేళ.. ఫ్యానుని స్పీడ్ గా తిప్పేందుకు వైసిపి అధినేత జగన్ కీలక మార్పులు చేస్తున్నారు.. భవిష్యత్ మనదే అంటూ కేడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.. తప్పులను సమీక్షించుకొని పార్టీ ప్రక్షాళనకు నడుం బిగిస్తున్నారు.. అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తూనే కొందరు కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి.. ప్రాధాన్యత ఇస్తున్నారు.. వరుస సమీక్షలు నిర్వహిస్తూ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు..

సంక్షేమ పథకాలు మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని భావించిన జగన్ లెక్క తప్పింది.. వై నాట్ 175 అన్న వైసీపీకి 11 సీట్లు దక్కాయి.. నిన్న మొన్నటి దాకా ఓటమి షాక్ లో ఉన్న పార్టీ నాయకత్వం.. ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.. ముఖ్య నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతూ ఉండడంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు.. నష్ట నివారణ చర్యలు తీసుకుంటూనే.. పార్టీ ప్రక్షాళన పై ఆయన దృష్టి పెట్టారు.. క్యాడర్ లో కొత్త ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నికల ఫలితాలపై జిల్లాల వారీగా అంతర్గత సమీక్షలు నిర్వహిస్తూ.. నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు.. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూనే.. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకాన్ని చేపడుతున్నారు.. పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరుతున్న వారికి ప్రత్యామ్నాయంగా నేతలను తయారు చేస్తున్నారు..

గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.. ఎంపీటీసీలు జడ్పిటిసి లతో పాటు ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.. ఇప్పటిదాకా జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న జగన్.. పనిలో పనిగా అనుబంధ సంఘాలను సైతం యాక్టివ్ చేస్తున్నారు.. వారి ద్వారా పార్టీ కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో ఏర్పడిన నిస్తేజానికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహాల రచిస్తున్నారు.. పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తూనే.. పోరాటాలకు సిద్ధం కావాలనే సంకేతాలను పంపుతున్నారు.. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతల సూచనలు సలహాలను జగన్ తీసుకుంటున్నారట.. వారి సూచనలు సలహాలపై ఆయన ఓ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి.. కీలక బాధ్యతలు అప్పగించాలని ఆయన భావిస్తున్నారట.. క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తున్నారు. మొత్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news