ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ త్వరత్వరగా పూర్తిచేసే పనిలో పడ్డాడు. వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసి ఎన్నికలపై ఫోకస్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే భవదీయుడు భగత్ సింగ్, హరిహరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. సాయిధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సిథం రీమేక్ షూటింగులో పాల్గొంటున్నాడు.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామంది.
ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ దేవుడిగా కనిపించనుండగా.. సాయిధరమ్ తేజ్ ఆయన భక్తుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.