దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి కీలక ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు కవిత ఈడీ ఎదుటకు హాజరయ్యారు. మూడోసారి హాజరయ్యేటప్పుడు ఆమె తనతోపాటు మొబైల్ ఫోన్లను ఈడీ ఎదుటకు తీసుకువెళ్లారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ జాయింట్ డైరెక్టర్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశారు. కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావాలని చెప్పారు. వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో తన ప్రతినిధిని పంపాల్సిందిగా ఈడీ లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో కవిత తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ ముందుకు వెళ్లనున్నారు. అయితే ఎప్పుడు హాజరు కావాలనే విషయం మాత్రం ఈడీ అధికారులు లేఖలో స్పష్టం చేయనట్లు తెలుస్తోంది.