నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ఈ ప్రమాదంతో ఛిన్నాభిన్నమైంది. అసలేం జరిగిందంటే..?
మోర్తాడ్ మండలం దొన్కల్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో బడాభీమ్‌గల్ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. కారులో మొత్తం ఏడుగురితో తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భీమ్‌గల్ పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ట్రాక్టర్ ట్రాలీపై ఉన్న పొక్లెయిన్ వారి కారుపై పడడంతో అందులో ఉన్న లక్ష్మి కుమారుడు ముప్పారపు రాజేశ్వర్ (45), కోడలు జ్యోతి (42), కుమార్తె రమ (41) అక్కడిక్కడే మృతి చెందారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు గంటసేపు శ్రమించారు. ముప్పారపు రాజేశ్వర్, జ్యోతి దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పొక్లెయిన్.. ఎదురుగా వస్తున్న కారుపై ఎలా పడింది? కారు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.