దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డేటా లీకేజీపై కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) దృష్టి సారించింది. రక్షణశాఖతో పాటు అనేక విభాగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఏమైనా ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానంతో ఐబీ రంగంలోకి దిగింది.
ఇప్పటికే సైబరాబాద్ అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న ఐబీ ప్రతినిధులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు త్వరలో ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రకోణం ఉన్నట్లు తేలితే కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ.)కి బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ఈ కేసులో ఏడుగురు సభ్యుల ముఠాను ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల్లో అనేక ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ ఉండటంతో కేంద్ర నిఘా సంస్థ దృష్టి సారించింది. ఇంత పెద్ద రాకెట్‌ను పట్టుకున్నందుకు వారిని ఈ సంస్థ అధికారులు అభినందిస్తున్నారు.