శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పూజిస్తే కలిగే ఫలాలు ఇవే!!

-

దేశవ్యాప్తంగా ఆశ్వీజ పాడ్యమి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రులను అత్యంత వైభవంగా భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రీవిద్య ఉపాసన దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది. భక్తులు వారివారి శక్తి కొలది శక్తిని అంటే అమ్మవారిని ఆరాధిస్తారు. మొదటిరోజు నవరాత్రులలో అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఆరాధిస్తారు. అయితే అమ్మ ఆరాధన ఎందుకు, ఎలా చేయాలి, ఏం నైవేద్యాన్ని సమర్పించాలి, అమ్మను ఇలా ఆరాధిస్తే వచ్చే ఫలితం గురించి తెలుసుకుందాం…

శైలపుత్రి: పర్వతరాజు హిమవంతుని పుత్రికగా అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే పేరు వచ్చింది. వృషభ వాహనంపై కుడి చేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలంతో అమ్మ విరాజిల్లుతుంది. ఇదే నవదుర్గలలో మొదటి అవతారం. పూర్వజన్మలో దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో సతీదేవిగా అవతరించి పరమేశ్వరుని పరిణయమాడింది. దక్ష యజ్ఞంలో దాక్షాయని పొందిన అవమానానికి యోగాగ్నిలో తనువును చాలించి మరుజన్మలో హిమవంతుని పుత్రికగా జన్మిస్తుంది. ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కిన జగన్మాతకు పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

Maa Shailputri

‘శైలపుత్రి’గా అవతరించిన అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకుని, తన శరీరంలో అర్థభాగం ఇచ్చాడు. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ మహిమలూ, శక్తులూ అనంతరం. నవరాత్రి ఉత్సవాలలో మొదటిరోజు ఈ రూపంలో దేవిని పూజించి, ఉపాసిస్తారు. మొదటి రోజు యోగులు ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపర్చకొంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

“వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌”!!
నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది.

నైవేద్యం: శైలపుత్రికి సమర్పించే నైవేద్యం పులగం.
తొలిరోజు పూజచేస్తే ఫలితం: మొదటి రోజు భక్తిశ్రద్ధలతో శైలపుత్రిని పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ ఇస్తుంది అని శాస్ర్తాలు పేర్కొన్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news