టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆలూరు నియోజకవర్గం ఎంకే కొట్టాల నుంచి 73వ రోజు ప్రారంభం కాగా, దారిపొడవునా ఘనస్వాగతం లభించింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆలూరు నియోజకర్గ ప్రజలు లోకేశ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గుడిమిర్ల శివార్లలో గొర్రెల కాపర్లను కలిసిన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంకటాపురం వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, వెంకటాపురంలో రైతులతో యువనేత లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపడితే ఈ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించడమే కాకుండా పనులు చేపట్టలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పనుల్లో వేగం పెంచి సామర్థ్యం మళ్లీ 8 టీఎంసీలకు పెంచుతామని స్పష్టం చేశారు. “ఆలూరులో టీడీపీ గెలవకపోయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిన్నచూపు చూడలేదు. నగరడోన ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేశాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆలూరులో టీడీపీని ఆదరించండి, వేదావతి, నగరడోన ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికీ తాగు నీరందించే బాధ్యత తీసుకుంటాం. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతోంది.