తెలంగాణ ఆర్టీసీలో కొలిక్కిరాని చర్చలు..

-

ద‌స‌రా పండ‌గ రావ‌డంతో ఎక్క‌డెక్క‌డో స్థిర‌ప‌డిన వారంద‌రూ సొంతూర్ల‌కు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆర్టీసీ సమ్మెకు వెళ్తే ప్రజలు ఇబ్బందులు ప‌డ‌తారు. అయితే ఆర్టీసీలో శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మెను నివారించేందుకు త్రిసభ్యకమిటీ రెండోరోజైన గురువారం ఆర్టీసీ కార్మికసంఘాల నాయకులతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. మూడుదఫాలుగా, విడివిడిగా జేఏసీ నేతలతో చర్చించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో వారు శనివారం నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రత్యేకదృష్టి సారించిందని, అందుకే కమిటీ వేసిందని, ఇలాంటి సమయంలో తొందర పాటు నిర్ణయాలువద్దని సూచించింది. అంతకుముందు ఆర్టీసీ అధికారులతో కూడా కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా సిద్ధంగా ఉంటామని కమిటీ సంకేతాలిచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ సంతృప్తికరమైన హామీ ఇవ్వలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.

ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ విలీనం సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి గడువు చెప్పకుండా మభ్యపెడుతున్నారని విమర్శించారు. అందుకే ఈ నెల ఐదు నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. కార్మికులు, ఉద్యోగులు త్యాగాలకు సిద్ధంకావాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినప్పటికీ ప్రభుత్వం తమ కష్టాలను విస్మరించిందన్నారు. ధనికరాష్ట్రంలో ఆర్టీసీని ఆదుకోకపోతే ఎలాగని ప్రశ్నించా రు. ఒకవైపు చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవటం దారుణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news