సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం మాలమహానాడు ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక అసమానతలు దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందరి వాడని, ఏ ఒక్కరికో పరిమితం చేయడం తగదని పేర్కొన్నారు. అందరికి చదువు అన్నదే అంబేద్కర్ ఆశయమని అన్నారు. ఆ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిదిన్నర ఏళ్లలో కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు.
అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అక్షరం పొల్లు పోకుండా అక్షర రూపం ఇస్తున్న ఘనత ముమ్మాటికి కేసీఆర్ దేనన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్అన్నపూర్ణమ్మ, నాయకులు తల్లమల్ల హస్సేన్, మేక వెంకన్న, అనుములపురి రవిబాబు, ఎర్రమల్ల రాములు, యశోద రవి, అశోక్, కల్లెపల్లి మహేశ్వరీ, బలరాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.