కొన్నిరోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర సర్కార్, గవర్నర్ ఇరువురు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ తన వద్దకు పంపించిన బిల్లులకు ఆమోదం తెలపకపోవడం మరింత వివాదానికి తెర తీసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే తాజాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన వద్ద ఉన్న మూడు పెండింగ్ బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్.. తాజాగా తన వద్ద ఉన్న మరికొన్ని బిల్లుల్లో ఒకదాన్ని తిరస్కరించగా.. మిగతావాటిపై ప్రభుత్వ వివరణ కోరారు. ప్రభుత్వం ఆమోదించి తన వద్దకు పంపిన డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును ఆమె తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వాటిలో పురపాలక నిబంధనల చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. గవర్నర్ ఇప్పటికే 3 బిల్లులను ఆమోదించగా, మరో రెండింటిని పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపించారు.