రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు కకావికలమైపోతున్నారు. చేతికొచ్చిన పంటంతా నీటిపాలవుతుంటే చూడలేక గుండె పగిలిపోయింత బాధ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షాలు, వడగళ్లతో 27 జిల్లాల్లో 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరిపైర్లకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది. ఆ తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ జిల్లాల్లో నష్టతీవ్రత ఎక్కువగా ఉందని నిర్ధారించింది. వివిధ జిల్లాల్లో వరసగా నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవడం, ఎక్కువ ప్రాంతాల్లో వడగళ్ల కారణంగా పంటలకు తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా తేలడంతో సమగ్ర సర్వే చేయాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కలెక్టర్ల ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు.