పంజాబ్ రాజకీయ దిగ్గజం, శిరోమణి ఆకాలీదళ్ అగ్ర నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితమే మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ పార్టీ ప్రధాన కార్యాలయంలో బాదల్ భౌతిక కాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత తాను ప్రాతినిధ్యం వహించిన బాదల్ గ్రామానికి తరలిస్తారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలను నిర్వహిస్తారు. బాదల్‌కు కుమారుడు సుఖ్‌బీర్ సింగ్, కుమార్తె పర్నీత్ కౌర్ ఉన్నారు. సుఖ్‌బీర్ ఆయనకు రాజకీయ వారసుడుకాగా.. పర్నీత్ మాజీ మంత్రి ఆదేశ్ ప్రతాప్‌సింగ్ కైరాన్ సతీమణి. సుఖ్‌బీర్ సతీమణి హర్‌సిమ్రత్ కౌర్ బఠిండా ఎంపీగా ఉన్నారు. బాదల్ మృతితో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.