దేశంలో ప్రస్తుతం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ అంశంపై పలుమార్లు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది కేంద్రం. అయితే తాజాగా.. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది ప్రముఖులు రాష్ట్రపతికి లేఖ రాశారు. మత విశ్వాసాలు, సంప్రదాయాలకు భిన్నంగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే యత్నాలు తీవ్ర అభ్యంతరకరమైనవని 120 మంది ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
అసహజమైన, నిర్హేతుకమైన స్వలింగ పెళ్లిళ్లను వ్యవస్థీకృతం చేయడాన్ని భారతీయ సమాజం, సంస్కృతి ఆమోదించబోవని లేఖలో పేర్కొన్నారు. దేశ మౌలిక సాంస్కృతిక సంప్రదాయాలు, మతాచారాలపై నిరంతరంగా దాడులు జరగడం తమను నిర్ఘాంతపరుస్తోందని వివరించారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో హైకోర్టు పూర్వ జడ్జీలు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు.
మరోవైపు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని ఇటీవలే సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. వారి భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఈ ప్రక్రియను అసంపూర్తిగా మార్చుతుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై కోర్టులో గట్టిగా వాదనలు జరుగుతున్నాయి.