ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన విశాఖ కిడ్నీ మాఫియా ప్రధాన సూత్రధారులను బయటకు లాగాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి, మద్యం మత్తులో నిరుద్యోగ యువతను లొంగదీసుకుంటున్నారని అన్నారు. కిడ్నీ మాఫియాలో ఎవరు ఉన్నా అరెస్టు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే మోసగాళ్లకు వరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారని మండిపడ్డారు. ద్విచక్ర వాహనం కొనిస్తామని ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకువచ్చారంటేనే పరిస్థితి అర్థమవుతుందన్నారు. కిడ్నీ రాకెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని.. ఇంకెంత మంది బాధితులు ఉంటారో అనే ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు.