తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన సీఎం ఛాంబర్ లో ఆశీనులైన కేసీఆర్ 6 ఫైళ్లపై సంతకం చేశారు. ఇక ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తన చేతుల మీదుగా సచివాలయం ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇక్కడ సచివాలయం ఎంత గొప్పగా ఉందో.. రాష్ట్రంలోని గ్రామాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయన్నారు. దేశంలోనే మన రాష్ట్రం గొప్పగా ముందుకు సాగుతుందన్నారు కేసీఆర్. సమైక్య పాలనలో ఎంతో విధ్వంసం జరిగిందని.. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి బాటలోనే శాంతియుత పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని.. వారికి గౌరవ సూచకంగా ఆకాశమంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.