ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకాన్ని ఈనెల 15న అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ప్రతి రైతుకు రూ.12500 చొప్పున ఈ భరోసా పథకంలో పంపిణీ చేయనున్నారు. నిజానికి ఇది చాలా సంచలన కార్యక్రమం. రాష్ట్రంలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యక్రమం కూడా. అయితే, దీనిని అంతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని జగన్ సర్కారు కూడా భావిస్తోంది. తాము అధికారంలోకి వచ్చీరాగానే.. తన మేనిఫెస్టోలో కీలకమైన ఈ హామీని నెరవేర్చడాన్ని జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు వ్యూహాలు రచించింది.జగన్ కనుక తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే.. జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ ఉండే ఛాన్స్ లేదు. ఏదో రాష్ట్ర పత్రికలు, లేదా జగన్ అభిమాన పత్రికలు మాత్రమే రాస్తాయి. మీడియా చూపిస్తుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ఏర్పాటు చేస్తే.. దీనికి ఆశించిన దానికన్నాఎక్కువగానే కవరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు శనివారం ఢిల్లీ వెళ్లారు. దాదాపు గంటకు పైగా ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు చర్చించారు. అయితే, దీనిపై స్థానిక ఏపీ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. జగన్ అడిగాడు కానీ,.. ప్రధాని వచ్చేందుకు ఇష్టపడడం లేదంటూ.. ఓ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
దీంతో జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి మోడీ వస్తారా? రారా? అనే విషయంపై రాజకీయ చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అసలు ట్విస్ట్ ఏంటి? నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి వస్తే.. ఆయనకు లాభించే అవకాశం లేదా? ఏపీ బీజేపీ నేతలు ఏదో చెప్పినట్టు.. కేవలం జగన్‌కు మాత్రమే మోడీ పర్యటన బూస్ట్ ఇస్తుందా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి నరేంద్ర మోడీ ఈ నెల 10 తర్వాత ఫుల్ బిజీ అవుతున్న మాట వాస్తవం.
హరియాణా, మహారాష్ట్ర ల్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ప్రచారం, ప్రభుత్వాలను కాపాడుకోవడం ఆయన తక్షణ కర్తవ్యం. అదే సమయంలోచైనా నుంచి అధ్యక్షుడు భారత్ పర్యటనకు వస్తున్నారు. కాబట్టి.. ప్రధాని ఏపీకి వచ్చేందుకు ఛాన్స్‌లేదనేది వాస్తవం. అయితే, ఆయన వస్తే.. మాత్రం జగన్ కంటే కూడా బీజేపీకి లాభం ఎక్కువగా ఉంటుంది. తాము ఇస్తున్న ఆరు వేలకు జగన్ ప్రభుత్వం 6500 కలిపి ఇస్తున్న విషయాన్ని గట్టిగాచెప్పుకొనేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఇదంతా సస్పెన్స్‌గానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.