ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో అధికంగా రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ప్రయాణికుల వద్ద అధికంగా రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. మంత్రి అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడారు.
ఆర్టీసీ బస్సుల్లో అధికంగా రేట్లు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, దీనిపై దృష్టి సారించామని, టికెట్ ధరకంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకుంటే వారిపైన కఠిన చర్యలు తప్పవని, అధికంగా డిమాండ్ చేస్తే ప్రయాణికులు ఇవ్వరాదని అన్నారు. ఇక గురువారం రోజున దాదాపుగా అన్ని రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు తగిన విధంగా అన్ని డిపోల్లో డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఇక అన్ని బస్సుల్లో విద్యార్థులు, జర్నలిస్టులు, వికలాంగులు, ఉద్యోగుల బస్‌పాస్ ఉన్న అందరిని అనుమతి ఇస్తారని, ఇవ్వకుంటే నిలదీయాలని ఆయన సూచించారు. ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉండే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. దసరా పండుగకు వెళ్ళినవారు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.