తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు ప్రగతి భవన్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో గత ఆరు రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మె ప్రభావం, ప్రయాణికుల ఇబ్బందులను, ప్రత్యామ్నయ ఏర్పాట్లుతో పాటు పలు ఆంశాలపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకు కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు ఎలా చేయాలో ఏం చేయాలో పూర్తిస్థాయిలో వివరాలతో రావాలని కలెక్టర్లకు సమాచారం అందించింది సీఎం కార్యాలయం.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకునేందుకు, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడిపేందుకు ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్‌లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆర్టీసీ సమ్మె ఇప్పటికే ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం సమ్మెపై కొరడా ఝులిపిస్తుంది.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే జాతీయస్థాయి కార్మిక సంఘాలు కూడా రంగంలోకి దిగాయి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, కేసీఆర్ తీసుకున్న ఆర్టీసీ వ్యతిరేక నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓవైపు జాతీయ స్థాయి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ యూనియన్లకు తోడుగా పలు రాజకీయ పార్టీలు కూడా సపోర్టు చేస్తున్నాయి. ఇక తెలంగాణలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలుతో పాటు ప్రజాసంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు నష్ట నివారణ చర్యలకు దిగింది.
అందులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి సమ్మెతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకునేందుకు, ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడం, స్థానికంగా ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.