బఖ్‌ముత్‌లో రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకుపోతున్న జెలెన్‌స్కీ సేనలు

-

ఉక్రెయిన్​పై ఏడాదికి పైగా రష్యా భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్​లోని పలు ప్రాంతాలను రష్యా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కన్ను ఉక్రెయిన్​లోని బఖ్​ముత్​పై పడింది. ఈ క్రమంలోనే త్వరలోనే బఖ్‌ముత్‌ను వశం చేసుకుంటామని గత కొన్ని రోజులుగా రష్యా చెబుతూ వచ్చింది.

అయితే రష్యాకు ఆ నగరంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉక్రెయిన్‌ దళాల ఎదురుదాడికి వెనక్కి మళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ‘‘కొన్ని ప్రాంతాల్లో మా దళాలు దూసుకుపోతున్నాయి. శత్రువుకు తీవ్ర ప్రాణ, ఆయుధ నష్టం కలిగిస్తున్నాం’’ అని ఉక్రెయిన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ దళాలు వెనక్కి మళ్లుతున్న విషయాన్ని రష్యా అంగీకరించింది. అయితే బఖ్‌ముత్‌లో ఇతర ప్రాంతాల్లో దూసుకుపోతున్నట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోనూ సమావేశం కానున్నారు. అనంతరం ఆయన జర్మనీకి వెళ్లనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news