తెలంగాణ దశాబ్ది వేడులకపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రతిపాదనలపై సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉత్సవాలపై రూపొందించే డాక్యుమెంటరీల గురించి సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఆయా శాఖలు సాధించిన విజయాలను చాటిచెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.