తెలంగాణలో ఇక నుంచి మొబైల్ పోయిందని ఎవరూ దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అద్భుత ఫలితాలను ఇస్తోంది కాబట్టి. కేవలం నెల రోజుల్లోనే వెయ్యి ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సీఈఐఆర్ పోర్టల్ ఏర్పాటు చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పోలీసు శాఖను ఎంపిక చేసింది.పోర్టల్ ప్రారంభమైన ఏప్రిల్ 19 నుంచి మే19 వరకు అంటే నెల రోజుల్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా 16,011 ఫోన్లు బ్లాక్ చేశామని, వీటిలో 4,226 ఫోన్లు ఎక్కడున్నాయో తెలిసిందని, వాటిలో నుంచి 1,016 ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ వివరించారు.