ఈనెల 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం ముదురుతోంది. ఈ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించడం వివాదానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రారంభిస్తేనే తాము వస్తామని.. లేకపోతే రామని కాంగ్రెస్ సహా 19 పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం ప్రజాస్వామ్యం పై దాడి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రతిపక్షాలు బాయికాట్ చేయడంపై తాజాగా కేంద్రమంత్రి ఆర్కేసింగ్ స్పందించారు. పార్లమెంటు పవిత్రతను ప్రతిపక్షాలు ధ్రువీకరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అనేకసార్లు బాయికాట్ చేశాయని.. పార్లమెంటు మీద వారికి ఎటువంటి గౌరవం లేదన్నారు. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు ఆర్కేసింగ్.