తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘన కీర్తి దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగిపోయేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుండి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4వ తేదీ ఆదివారం నాడు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను, జూన్ 6 మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9 శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా, జూన్ 12 సోమవారం నాడు గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.