ద‌గ్గుబాటికి జ‌గ‌న్ వ‌రుస షాకులు…

-

గత కొన్ని రోజులుగా పర్చూరు రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్న ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓటమి పాలైన దగ్గర నుంచి అంత యాక్టివ్ గా లేని దగ్గుబాటిని పక్కనబెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్ళిన రావి రామనాథం బాబుని దగ్గుబాటికి చెప్పకుండా మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు రావి పర్చూరు ఇన్ చార్జ్ గా పని చేశారు. కానీ దగ్గుబాటికి టికెట్ ఇవ్వడంతో టీడీపీలోకి వెళ్ళిపోయి..మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు.

దగ్గుబాటికి చెక్ పెట్టేందుకే రావిని పార్టీలోకి తీసుకొచ్చారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఇటీవల దగ్గుబాటికి తన భార్య, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని బీజేపీకి రాజీనామా చేయించి, వైసీపీలోకి తీసుకురావాలని జగన్ అల్టిమేటం జారీ చేశారని వార్తలు వచ్చాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకే పార్టీలో ఉండాలని సూచించారని తెలిసింది. దీంతో దగ్గుబాటి కన్ఫ్యూజన్ లో పడ్డారు. భార్యని వైసీపీలోకి తీసుకురావడం కంటే తానే బీజేపీలోకి వెళ్లిపోతేనే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న పురంధేశ్వరి తిరిగి రాగానే తన నిర్ణయం చెప్పనున్నారు. అయితే ఈలోపే పర్చూరు వైసీపీలో జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. దగ్గుబాటి పార్టీలో సరిగా యాక్టివ్ గా లేని కారణంగా రావి రామనాథం బాబుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతకముందు ఛైర్మన్ పదవిని పర్చూరు లేదా అద్దంకి ఇన్ చార్జులకు ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ అద్దంకి ఇన్ చార్జ్ బాచిన చెంచు గరటయ్య ఈ పదవి తీసుకోవడానికి విముఖత చూపించారు.

అలాగే పర్చూరుకు చెందిన గొట్టిపాటి భరత్‌కు అవకాశం ఇవ్వాలని భావించగా ఆయన ఆ పదవి తీసుకునేందుకు నిరాకరించారు. అయితే దగ్గుబాటితో మాత్రం దీని గురించి చర్చ చేయలేదని తెలిసింది. దీంతో తాజాగా పార్టీలో చేరిన రామనాథం బాబుకు ఛైర్మన్ పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైపోయారు. దీని బట్టి చూసుకుంటే త్వరలోనే పర్చూరు ఇన్ చార్జ్ పదవి కూడా రావికే ఇచ్చేయొచ్చు. దగ్గుబాటిని తనంతట తాననే పార్టీ నుంచి బయటకు పంపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news