అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అడవుల పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర పర్యావరణహిత కార్యక్రమాల్లో… దేశంలోనే నంబర్ వన్ స్థానం కైవసం చేసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో.. శాస్త్ర పర్యావరణ కేంద్రం… ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంట్’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వగా… 7.213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2.757 పాయింట్లతో రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా.. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సీఎస్‌ఈ నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై.. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పర్యావరణం పట్ల సీఎం కేసీఆర్ నిబద్ధతకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ దూరదృష్టితోనే.. తెలంగాణలో పచ్చదనం పెరుగుతోందని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు.