హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్‌ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సభకు దాదాపు 50వేల మంది జనం హాజరుకానున్నట్టు సమాచారం. అయితే కొద్దిసేపట్లో సభ ప్రారంభం కానుందనగా భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. వర్ష ప్రభావానికి వేదిక చిందరవందరగా మారింది.
సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు తడిసిముద్దయ్యారు. నేలంతా చిత్తడిగా మారింది. సీఎం కేసీఆర్ సభకు హాజరై.. నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను కేటాయిస్తారని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతారని అంతా భావిస్తున్న సమయంలో వరుణుడు అడ్డుపడటంతో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు.