అసలే మూలిగేనక్క మాదిరిగా తయారైన టీడీపీ పరిస్థితిపై ఇప్పుడు తాటిపండు పడిన చందంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో టీడీపీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా.. ఈ పార్టీకి చెందిన కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ మోహన్‌పై అనర్హత పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను రద్దుచేయాలని బాపులపాడు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దుట్టా శివనారాయణ డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యురు గ్రామాల్లో మండల రెవిన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ప్రజలను మోసం చేసిన వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ పట్టాల పంపిణీపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా సహకరించ లేదని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళ్లామని, విచారించి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
వల్లభనేని వంశీ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైంది. దీంతో టీడీపీలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. యువతకే పగ్గాలు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో వంశీకి పార్టీలో కీలక పదవి దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఇంతలోనే ఆయన అనర్హత పిటిషన్ దాఖలు కావడంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై ఉన్నతస్థాయిలో సీనియర్లే తర్జన భర్జన పడే పరిస్థితి నెలకొంది. ఎంత లేదన్నా ఆరు మాసాల్లోనే ఈ కేసు పరిష్కరించాలని వైసీపీలో సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వంశీపై వేటు పడితే.. పార్టీకి తీరని నష్టం చేకూరడం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతోఏం చేయాలనే విషయంపై అధినేత త్వరలోనే సమాలోచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.