తెలంగాణకు పెట్టుబడుల వర్షం ఇంకా కొనసాగుతోంది. సోమవారం రోజునే అంతర్జాతీయ సంస్థ లులు రాష్ట్రంలో రూ.3500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రారంభించింది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఫ్రాన్స్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ టెలిపర్‌ఫార్మెన్స్ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ పెట్టుబడితో 3 వేలకు పైగా ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకోనున్నట్లు టెలిపర్‌ఫార్మెన్స్ ప్రకటించింది. జులైలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే ఆ సంస్థ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
టెలిపర్ఫామెన్స్ సంస్థ 45 ఏళ్ల కిందట పారిస్ కేంద్రంగా 1978లో ప్రారంభమైంది. కంపెనీని డానియెల్ జులియెన్ స్థాపించారు. క్రమంగా సంస్థ విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.