కొద్దిరోజుల క్రితం ఓ ప్రేమజంట నడిరోడ్డుపై గొడవ పడుతుండగా హీరో నాగశౌర్య కలగజేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా రంగబలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయంపై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. ఆ సంఘటనలో అమ్మాయిదే తప్పు అని చెప్పుకొచ్చాడు.
‘‘ఆ రోజు జరిగింది పూర్తిగా వేరు. ఆ అబ్బాయిని నేను కొట్టలేదు. పనిమీద వెళ్తుండగా, కూకట్‌పల్లిలో నడి రోడ్డుపై ఒక అబ్బాయి ఓ అమ్మాయిని కొడుతూ కనిపించాడు. వెంటనే అక్కడకు వెళ్లి, ‘ఎందుకు కొడుతున్నావ్. సారీ చెప్పు’ అని అడిగితే ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? ‘నా బాయ్‌ఫ్రెండ్ కొడితే కొడతాడు.. చంపితే చంపుతాడు..’ అంది. అమ్మాయిలే అలా అంటే ఇక ఏం చెబుతాం. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలకు ఒకటే చెబుతున్నా. మిమ్మల్ని కొట్టే అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. మీకు, మీ ఫ్యామిలీకి అది మంచిది కాదు. ఆ రోజు జరిగిన సంఘటనలో ఆ అబ్బాయిది తప్పుకాదు. కచ్చితంగా అమ్మాయిదే.’ అని చెప్పుకొచ్చాడు నాగశౌర్య. అంతే కాకుండా అది తను ప్రచారం కోసం ప్లాన్ చేసింది కాదని క్లారిటీ ఇచ్చాడు.