దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. సాధారణంగా కంపెనీ జూన్ త్రైమాసికంలో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగుల జీతాలను పెంచుతుంది. అయితే, ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందుల కారణంగా టెక్ దిగ్గజం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ గత కొంతకాలంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం టెక్ రంగం ఇబ్బందుల్లో ఉంది.
ఈసారి జీతాల పెంపు వాయిదా వేసేందుకు నిర్ణయించింది. సంస్థలోని సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి దిగువన ఉన్న వారందరికీ ఈసారి జీతాల పెంపు ఉండదని సమాచారం. శాలరీ హైక్‌కు అర్హులైన ఎంతో మందికి ఇప్పటివరకూ సంస్థ నుంచి ఎటువంటి సమాచారం అందలేని జాతీయ మీడియా పేర్కొంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి ఇన్ఫోసిస్‌లో జీతాలు పెంపు మొదలవుతుంది. పెంచిన శాలరీ వివరాలను సంస్థ సాధారణంగా జూన్ నెలకే ఉద్యోగులకు తెలియజేస్తుంది. పెంపు విషయంలో తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని అనేక మంది ఉద్యోగులు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో జీతాల పెంపు వాయిదా పడటం 2020 తరువాత ఇదే తొలిసారి.