న్న తెలంగాణలో రైతుల బ్రతుకులు బాగుపడుతుంటే రేవంత్ రెడ్డి లాంటి చంద్రబాబు శిష్యులు చూడలేకపోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందుకే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించారని… ఈనాడు ఆయన శిష్యుడు రేవంత్ రైతులకు ఉచిత కరెంట్ వద్దంటున్నాడని అన్నారు.
మంత్రి మాట్లాడుతూ, ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేక విధానాలపై బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టనపెట్టుకోగా ఈరోజు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశానికి అన్నంపెట్టే అన్నదాతలు అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కండ్ల మంటేనని మండిపడ్డారు. మొన్న ధరణి వద్దన్నారని, ఇప్పుడేమో ఉచిత కరెంట్ వద్దని అంటున్నారని ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్ ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రైతన్నలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.