ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల ఆడవారికి అవకాశాలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని అధినేత ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మొదటిసారి దీపం పధకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు.
“నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే. ఆవిర్భావం నాటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. నేడు మహాశక్తి తీసుకొస్తున్నా. మహాశక్తి పదం నా మనసులో నుంచి వచ్చింది. రాష్ట్రంలోని మహిళల స్థితిగతులను మహాశక్తి కార్యక్రమం ద్వారా మార్చేస్తాం. ఆనాడు 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆ తర్వాత కాలంలో ఆస్తి హక్కును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు” అన్నారు.