బీసీ కుల వృత్తుల వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయం పంపిణీ రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 25వరకు ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఇదివరకే రూపొందించారు. లబ్ధిదారులకు సంబంధిత ఎమ్మెల్యేలు చెక్కులు అందజేయనున్నారు. నిధులతో చేతి, కులవృత్తుల వారు తమకు అవసరమైన సామగ్రి, పరికరాలు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించింది. సర్కారు సాయం పక్కదారి పట్టకుండా బీసీ సంక్షేమ శాఖ అధికారులు చొరవ చూపనున్నారు.
ఆర్థిక సాయానికి బీసీ కులవృత్తుల వారి నుంచి ఆన్లైన్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల జాబితాను జిల్లా అధికారులకు అందజేశారు. తరువాత ప్రభుత్వానికి జాబితాను కలెక్టర్ పంపించారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపరిచింది.