టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో టాలెంట్‌ను కోల్పోయింది. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ (70) ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు వేకువజామున 5 గంటలకు కన్నుమూశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న శ్రీరమణ జన్మించారు. సినీ రంగంలో బాపు- రమణతో కలిసి పనిచేశారు. ఆయన పేరడీ రచనలకు చాలా ఫేమస్. పలు తెలుగు పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణ కీలక పాత్ర వహించారు.
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మిథునం సినిమాకు శ్రీరమణే కథ అందించారు. శ్రీ రమణ.. మిథునం కథ రాసిన పాతికేళ్ల తర్వాత ఆ కథను తనికెళ్ల భరణి అత్యద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.