మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింది. దాదాపు 86 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న దానిపై సరైన స్పష్టత లేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంతో తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకోనున్నారని శివసేన పార్టీ వెల్లడించింది.
‘ఇర్షల్‌వాడీ గ్రామంలో కొండచరియలు విరిగిపడిపోయిన ఘటనలో కొందరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లలను దత్తత తీసుకొని వారికి సంరక్షకుడిగా ఉండాలని ఏక్‌నాథ్ శిందే నిర్ణయం తీసుకున్నారు. రెండు నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న ఆ చిన్నారులను శ్రీకాంత్ శిందే ఫౌండేషన్ కింద ఆశ్రయం పొందుతారని చెప్పారు. ఆ ఫౌండేషన్ వారికి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది’ అని శివసేన ఓ ప్రకటనలో తెలిపింది.