రష్యాతో యుద్ధం ముగిసిన వెంటనే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుతుందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే నాటో సదస్సులో తమ దేశం కూడా ఆ కూటమిలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2024వ సంవత్సరంలో వాషింగ్టన్ డీసీలో ఈ కూటమి వార్షిక సదస్సు జరగనుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికి తెలుసు ఆ రోజు ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన రోజు కావచ్చు అని రెజ్నికోవ్ అన్నారు.
రష్యాతో ఒక్క సారి యుద్ధం ముగిసిందంటే.. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుతుందని రెజ్నికోవ్ తెలిపారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండటంతో ఏకగ్రీవంగా కూటమిలోకి చేర్చుకోవడానికి మద్దతు లభించదని తమకు తెలుసని అన్నారు. యుద్ధం ముగిసినంత మాత్రాన ఉక్రెయిన్‌ను సులువుగా నాటో కూటమిలోకి తీసుకోవడం కుదరదని అమెరికా అధ్యక్షుడు గతంలో చెప్పారని.. అయితే తాము నాటోలో చేరడానికి అవసరమైన సంస్కరణలు చేపడతామని రెజ్నికోవ్ పేర్కొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది నాటికి ఉక్రెయిన్ పైలట్లు అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలతో గగనతల రక్షణ చేపడతారని రెజ్నికోవ్ వెల్లడించారు.