డెడ్లీ స్టంట్స్ చేస్తూ.. అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న డేర్ డెవిల్.. రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రమాదాలతో సరదాగా చెలగాటమాడే 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడు. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది.
హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడని అక్కడి అధికారులు తెలిపారు. కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికిబయట చిక్కుకుపోయాడని.. దీంతో భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడని చెప్పారు. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పింది. దీంతో నేరుగా కిందపడిపోవడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అతడిని కిటికి బయట చూసిన ఆ పెంట్‌హౌస్‌లోని పనిమనిషి ఆశ్చర్యపోయి పోలీసులకు కాల్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే అతడు కిందపడి మరణించాడు. లుసిడి.. బ్యాలెన్స్ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు.