అటు బాబు-ఇటు పవన్..జగన్‌ని ఆపగలరా?

-

అటు చంద్రబాబు..ఇటు పవన్ ప్రజాక్షేత్రంలో జగన్‌ని నిలువరించడానికి కష్టపడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటం జగన్ దూకుడుగా ఉండటం..సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పెద్ద ఎత్తున చేరువ కావడం, అభివృధ్ది పనులు చేయడం, కొత్త పెట్టుబడులు తీసుకురావడం..ఇలా అన్నీ అంశాల్లో జగన్ ముందు ఉన్నారు. ఇక ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టడానికి బాబు, పవన్ సైతం దూకుడుగానే ముందుకెళుతున్నారు.

ఇటీవల పవన్ వారాహి యాత్రతో దూసుకెళుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో వైసీపీ-పవన్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. అలాగే ఈ వారాహి యాత్ర వల్ల జనసేన మైలేజ్ కూడా కాస్త పెరిగింది. దీంతో మరోసారి పవన్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. మూడో విడత యాత్రని ఉత్తరాంధ్ర లేదా పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తిరిగారు కాబట్టి..ఈ సారి ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టవచ్చు.

ఇక ఉత్తరాంధ్ర నుంచి పవన్ వస్తే..రాయలసీమ నుంచి చంద్రబాబు వస్తారు. గత కొంతకాలంగా నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు పెడుతూ టి‌డి‌పి అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ వచ్చిన బాబు..ఆ మధ్య ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీడియా సమావేశాలు పెట్టారు. తమ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు..ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పారు.

ఇప్పుడు సీమలోని సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల వరకు వరుసగా టూర్ వెళుతున్నారు. ప్రాజెక్టులు సందర్శించనున్నారు. దీని ద్వారా వైసీపీ వైఫల్యాలని ఎండగట్టాలని చూస్తున్నారు. ఇటు ప్రకాశంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఇలా మూడు వైపులా జగన్‌ని ఎటాక్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ  విపక్షాలు ఎన్ని చేసిన ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news